• Home »
  • Politics »
  • పార్లమెంట్ అర్థరాత్రి సమావేశంలో చారిత్రాత్మక వస్తు సేవా పన్ను

పార్లమెంట్ అర్థరాత్రి సమావేశంలో చారిత్రాత్మక వస్తు సేవా పన్ను

PTI7_1_2017_000008Bపార్లమెంట్ సెంట్రల్ హాల్ లో అర్థరాత్రి చారిత్రాత్మక సమావేశంలో వస్తుసేవా పన్ను- జి.ఎస్.టి. ఆవిష్కృతమైంది. జీఎస్టీ ప్రారంభానికి సంకేతంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బటన్ ప్రెస్ చేశారు. అంతకుముందు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశానికి హాజరైనవారినుద్దేశించి ప్రసంగించారు. గతంలో కూడా పార్లమెంటు సెంట్రల్ హాల్ అనేకమైన చారిత్రక సందర్భాలకు సాక్షీభూతంగా నిలిచిందని.. రాజ్యాంగ పరిషత్, , రాజ్యాంగం ఆమోదం వంటి సందర్భాల తొలి సమావేశాలు సెంట్రల్ హాల్ లోనే జరిగాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. జీఎస్టీ సహకార ఫెడరల్ వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తుందనినరేంద్రమోదీ అభివర్ణించారు.కష్టపడి పనిచేయడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోయి అతి క్లిష్టమైన లక్ష్యాలను కూడా సాధించగలుగుతామన్న చాణక్యుని మాటలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. సర్దార్ పటేల్ సాధించిన దేశ రాజకీయ సమగ్రత తరహాలో జీఎస్టీ ఆర్థిక సమగ్రత సాధనకు దోహదపడుతుందని ప్రధానమంత్రి చెప్పారు. ఒకే దేశం.. ఒకే పన్ను జీఎస్టీ వల్ల సాధ్యపడుతుందని నరేంద్రమోదీ చెప్పారు. జీఎస్టీ వల్ల ఎంతో ఖర్చు, సమయం ఆదా అవుతాయని అన్నారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆలస్యాన్ని అధిగమించి ఇంధనాన్ని పొదుపుచేయడం వల్ల పర్యావరణానికి దోహదకారి అవుతుందని అన్నారు. సులభమైన, అత్యంత పారదర్శకమైన పన్నుల వ్యవస్థకు జీఎస్టీ దారితీస్తుందని, అవినీతిని అరికట్టేందుకు దోహదపడుతుందని నరేంద్రమోదీ చెప్పారు.అంతిమంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే మంచి, సులభమైన పన్ను (గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్)గా జీఎస్టీని ప్రధానమంత్రి అభివర్ణించారు.